యూనివర్సిటీ వీసీల జాడేదీ...?

...... ఎన్. సుమంత్



తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు అట్టహాసంగా ముగిసాయి. అన్ని సీట్లు గెలిచామని అధికార పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలలో అంతా డబ్బు, మద్యం, కులం, మతం, అధికార యంత్రాంగం అండతో గెలిచారని ప్రతిపక్షాలు, సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తున్నాము. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లాగానే ఈ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలలో కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యార్థులు, ప్రజల ఉద్యమాల ద్వారా ఏర్పడిన ప్రభుత్వంలో, ఈ హామీలు అమలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పడి 6 ఏండ్లు దాటినా విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకొనే పరిస్థితులు రాష్ట్రంలో కనబడుట లేదు. విద్య ద్వారానే దేశ భవిష్యత్తు బాగుంటదని అనేక మంది విద్యా వేత్తలు మేధావులు చెప్పారు. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, నూతన మార్పుకోసం ఆలోచించే శక్తులు, వ్యక్తులు, యూనివర్సిటీల నుండి వస్తారు. అలాంటి యూనివర్సిటీల పరిస్థితి మన రాష్ట్రంలో అగమ్యగోచరంగా ఉంది. కుటుంబం పెద్దని కోల్పోయిన కుటుంబంలాగా అనేక సమస్యలతో తెలంగాణాలోని యూనివర్సిటీలు ఉన్నాయి .


అసాధ్యం అనుకున్న తెలంగాణ కూడా సుసాధ్యం చేసిన నేల మనది. అంతటి పోరాట పటిమ గల తెలంగాణ గడ్డ, దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. ఇపుడు మాత్రం తన అస్తిత్వాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. .


తెలంగాణలో దాదాపు 14 ప్రభుత్వ స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి ఆరు నెలలుగా ఇంచార్జ్ వీసీ (వైస్ చాన్సలర్) పాలనలో నడుస్తున్నాయి. రెగ్యులర్ వీసీల నియమాక జాడనే లేదు.


రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఖాళీలు ఏర్పడితే, వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారు. లేదా ఒక ఎన్నికలలో గెలవగానే మరొక దానికి (తాజాగా సొసైటీ) ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తాం అంటున్నారు. కానీ వీసీల నియామకపు నోటిఫికేషన్ కి మాత్రం మాటెత్తడం లేదెందుకో..!


దేశ భవిష్యత్తును నిర్మించే యువతను, అంత్యంత సృజనాత్మకంగా ఆలోచించి యూనివర్సిటీల విద్యార్థులను విస్మరించి తెలంగాణ ప్రగతిని ఎలా సాధిస్తారు..? అసలు ఒక కుటుంబంలో, కుటుంబ పెద్ద లేకపోతే ఎన్ని సమస్యలు ఎదురుకుంటారో, తెలంగాణలో యూనివర్సిటీ విద్యార్థులు కూడా అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నాయి. , కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇంచార్జ్ వీసీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే యూనివర్సిటీలపై అధికారం చెలాయిస్తున్నది. యూనివర్సిటీల అకడమిక్ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది.


ఇంచార్జ్ వీసీలు ఇంకెన్నాళ్ళు..?


తెలంగాణలో ప్రముఖులైన ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారు. వీరందరూ వర్సిటీల పాలన చేయగల సమర్థులు కూడా. మొన్న వీసీల పదవికాలం ముగియగానే రెగ్యులర్ వాళ్ళను నియమించ కుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ వీసీ లను, అది కూడా ప్రభుత్వం కింద పనిచేసే ఐఏఎస్ అధికారులను నియమించారు.


వారికి యూనివర్సిటీల వాతావరణంపై, యూనివర్సిటీల అడ్మినిస్ట్రేషన్ పై ఎంత మాత్రం అవగాహన ఉండదు. యూనివర్సిటీల సమస్యలపై కలుద్దాం అనుకున్న విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు వీసీ ఛాంబర్ లో ప్రతిసారీ ఖాళీ కుర్చీ దర్శనం ఇస్తుంది. సమస్యలు కుప్పలు, తెప్పలుగా వస్తున్నాయి. విద్యార్థులు ఏమీ తోచలేని పరిస్థితులలో అక్కడ ఉన్న అధికారులను అడిగితే, వాళ్ళు కూడా మాకు సమాచారం లేదు అంటున్నారు. దీనితో ఇంచార్జ్ వీసీల పనితీరు ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇంచార్జ్ వీసీల పేరుతో యూనివర్సిటీలకు వచ్చిన అధికారులు యూనివర్సిటీ లలో పనిచేయకుండా సచివాలయంలో తమ యొక్క ఏసీ గదులలో బిజీగా ఉంటున్నారు. అధికార పార్టీ నాయకులకు సేవకులుగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీలో ఉన్నత బాద్యులు వచ్చినపుడు వాళ్లకి స్వాగతం పలకడానికో, వాళ్లకు సన్మానం చేయటానికో, వాళ్ళ మెప్పు కోసం యూనివర్సిటీలకు వస్తున్నారు తప్ప, విద్యార్థుల సమస్యలపై విద్యార్థులతో మాట్లాడటానికి ఒక్క సారి కూడా రాని తీరు ఉన్నది.


తెలంగాణ యూనివర్సిటీలలో కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితులలో ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ లేక పోవడంతో అటు వైపు ప్రొఫైసర్లు, మరోవైపు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్, మరియు అకడమిక్ వాతావరణం, యూనివర్సిటీల ఫంక్షనింగ్ మొత్తం వ్యతిరేక దిశలో నడుస్తుంది. త్వరితగతిన పనులు కావటం లేదు. దిక్కు తోచని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి.


యూనివర్సిటీలపై ప్రభుత్వ విధానాలు నిరంకుశంగా కూడా ఉన్నాయి. కష్టపడి చదివి యూనివర్సిటీలలో ర్యాంకులు సాధించి వచ్చిన మొదటి తరం విద్యార్థులకు యూనివర్సిటీలు కార్పొరేట్ కాలేజీల లాగా స్వాగతం తెలుపుతున్నాయి. ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో కూడా బోనోసైడ్ సర్టిఫికెట్, నుండి మెస్ డిపాజిట్లు దాకా ప్రతిదీ సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. హాస్టల్ రూమ్స్ దారుణంగా ఉన్నాయి. ఒక్కో రూమ్ లో 6 - 10 మంది విద్యార్థులకి ఎలాట్ చేస్తున్నారు. అంత మంది ఒక రూమ్ లో ఎలా చదవగలరు..? లేడీస్ హాస్టల్ లో త్రాగడానికి కనీసం మంచినీరు కూడా దొరకడం లేదు. కాలేజ్ కి పోయి వచ్చేటపుడు బాటిల్స్ లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. మరో పక్కన హాస్టల్ లో మెస్ ఓపెన్ చేయడానికి పదివేల రూపాయలు మెస్ డిపాజిట్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు అంత డబ్బు ఎక్కడ నుండి వస్తుంది.


మెస్ బిల్లులు తగ్గించమంటే, కొత్త హాస్టల్స్ నిర్మాణంకి నిధులు లేవంటూ రిజిస్ట్రార్లు చేతులెత్తేస్తున్నారు. కనుక ఈ సమస్యలు అన్ని పోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి రూ.1500 నుండి రూ.3000 వరకు స్కాలర్ షిప్స్ పెంచాలి.


ప్రతి పీహెచ్డీ విద్యార్థికి రూ.8000-10000 వరకు ఫెలోషిప్ ఇవ్వాలి. ఉచిత మెన్స్ సౌకర్యం కల్పించాలి. యూనివర్సిటీ అభివృద్ధి కి రూ.500-1000 కోట్ల నిధులు ఇవ్వాలి.


అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం మెడలు వంచి తెచ్చుకున్నోళ్ళం. తెలంగాణ వాళ్ళం. మరోసారి మన హక్కుల కోసం, యూనివర్సిటీల పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు మంచి విద్యకోసం పోరాటం చేయాలి. గతంలో ఉద్యమాలు చేసినపుడు మాట్లాడిన మేధావులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీల బాగు కోసం వాళ్ళు వంతుగా ఉద్యమం చేయాలి. రేపు రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో యూనివర్సిటీ లకు అధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. తక్షణమే ప్రొఫెసర్లను వైస్ ఛాన్సలర్ గా నియమించాలి. యూనివర్సిటీ లో పేరుకుపోయినటువంటి సమస్యలు అన్నిటినీ పరిష్కరించాలి. వీటిని సాధించేందుకు విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేద్దాం.


- పీడీఎస్ యు ఓయూ అధ్యక్షులు. 8639926533