మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి

రాష్ట్రపతికి లేఖ రాసిన ఉనా దళితులు



దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు ఉవెతున ఎగిసిపడుతున్న సందర్భంలో ఉనా బాధితులు రాష్ట్రపతికి సంచలన లేఖ రాశారు. మమ్ములను ఈ దేశం నుండి బహిష్కరించండి. దళితుల పట్ల వివక్ష లేని మరో ఏదైనా దేశానికి మమ్మల్ని పంపించండి అని ఆ లేఖలో వాళ్ళు కోరారు.


2016 లో గుజరాత్ లోని ఉనాలో ఏడుగురు దళితులను స్వయం ప్రకటిత గోరక్షక మూక కట్టేసి దుర్మార్గంగా కొట్టిన విషయం తెలిసిందే. వాళ్ళను కొడుతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్ళలో వైరల్ అయ్యి దేశ వ్యాప్త ఉద్యమానికి దారి తీసింది.


ఆ బాధితుల్లో ఒకరైన వశ్రమ్ సర్వైయా తన కుటుంబం తరపున రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆయనను కలిసిన “ది క్వింట్ డాట్ కామ్” ప్రతినిధితో మాట్లాడుతూ “మేము సీఏఏని వ్యతిరేకిస్తున్నాము, కాని వారు ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, దళితులను సమాన పౌరులుగా భావించే దేశానికి మమ్మల్ని బహిష్కరించాలి.”


“మేము భారతదేశంలో పౌరులుగా పరిగణించబడటం లేదు. హిందూ సమాజంలో దళితులు దారుణమైన వివక్షకు గురవుతున్నారు. కాబట్టి మేము వివక్షను ఎదుర్కోని వేరే దేశానికి పంపమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద ను అభ్యర్థిస్తున్నాము.”


“2016లో మమ్మల్ని కొట్టిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేరస్తులు బెయిల్ పై ఉన్నారు. మాకు వ్యవసాయ భూమి, ప్లాట్లు వాగ్దానం చేశారు కాని వాటిలో ఏ ఒక్క వాగ్దానం అమలుపరచలేదు.”


“అప్పటి గుజరాత్ సిఎం, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ 2016 లో మా దగ్గరికి వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక నెలలో మళ్ళీ మాదగ్గరికి వస్తానని మాట ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆమె రాలేదు, అమె ఇస్తానన్న ఉద్యోగాలు రాలేదు”.


దాడికి గురైన సోదరులందరి తరపున వశ్రామ్ రాష్ట్రపతికి రాసిన ఈ లేఖను జనవరి 7 న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా ప్రాంతీయ కార్యాలయానికి పంపారు.


గతంలో మేము తమకు కారుణ్య మరణానికి అనుమతి కావాలని కోరాం . ఇప్పుడు ఈ మా అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోకపోతే, నేను నా సోదరులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు అత్మాహుతి చేసుకుంటాం” అని వక్రమ్ సర్వైయా చెప్పారు.


(ది క్వింట్ డాట్ కామ్ సౌజన్యంతో...)