హేతుబద్ద మేధావుల ఉత్పత్తి కేంద్రం జేఎన్‌యూ

...... ఎస్.నాగేశ్వర్ రావు



ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై, ఆచార్యులపై ముసుగు దుండగులు మారణాయుధాలతో భౌతిక దాడులు చేశారు. జేఎన్‌యూ ఎసీయూ అధ్యక్షులు అయిషీ ఘోష్ తోపాటు అనేక మందిని తీవ్రంగా గాయ పరిచారు. ఆ దాడులు మా పనే అంటూ హిందూత్వ సంస్థల ప్రతినిధులు మీడియా ముందు ప్రకటించుకున్నారు. దాడి చేశామని బాహాటంగా ప్రకటించిన వారి పట్ల, దాడిలో పాల్గొన్న వారి పట్ల ఉదాసీనత చూపెడుతూ గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి నేతలపై, ఢిల్లీ లెఫ్ట్సేంట్ గవర్నర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి జేఎన్‌యూ పరిణామాల సందర్భంలో సైతం లెఫ్ట్ విద్యార్థులపై రాజ ద్రోహం కేసులు నమోదు చేసి విద్యార్థులను జైలు పాలు చేశారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మరియు ఢిల్లీ హైకోర్టు న్యాయ విచారణలో నాటి వివాదంలో విద్యార్థుల ప్రమేయం లేదని తేల్చినా, ప్రభుత్వ పెద్దలు, పోలీసులు తీరు మార్చుకోవడం లేదు.


ఇటీవలి కాలంలో అధికార పార్టీ పార్లమెంటు సభ్యులూ, కేంద్ర మంత్రులూ జేఎన్‌యూ విద్యార్థులపై, ఆచార్యులపై వివాదాస్పద ప్రకటనలు చేస్తూ విశ్వవిద్యాలయాలలో వైషమ్యాలకు బీజాలు వేస్తున్నారు. మరోవైపు జేఎన్‌యూపై మీడియాలో నెగిటివ్ ప్రచారానికి తెర లేపారు. సోషల్ మీడియా నెట్ వలలో జేఎన్‌యూ విద్యార్థుల పరిశోధనలు, అకడమిక్ నాలెడ్జ్ పై ఫేక్ వార్తలను సైడ్ చేస్తూ జేఎన్‌యూ ప్రతిష్ఠను నీరు కార్చాలనే పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక విశ్వ విద్యాలయంపై, ఒక నూతన యువతరంపై దేశ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వాధినేత స్వయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుండటంతో యావత్ ప్రపంచం నివ్వెర పోతున్నది. జేఎన్‌యూ విద్యార్థులకు వారి ప్రగతిశీల పోరాటాలకు మద్దతుగా ప్రపంచ వ్యాప్త ప్రముఖులు విద్యావేత్తలు స్పందిస్తూ విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు.


జేఎన్‌యూను టార్గెట్ గా ఎంచుకోవడానికి ఆధిపత్య భావజాల కోణం దాగి ఉందనేది పరిశీలకులకు అవగతమవు తున్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండవ సారి అధికారం చేపట్టారు. ఆయా రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాజధాని నడిబొడ్డున గల జేఎన్‌యూ విశ్వవిద్యాలయం, తన శాస్త్రీయ ప్రశ్నావళితో ప్రధాని కంటిలో నలుసుగా మారింది. అక్కడ విద్యార్థి సంఘాల ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరోక్ష సహకారాలు కలిగిన విద్యార్థి పరిషత్ రాణించలేక పోతున్నది. విద్యార్థులు ఆ సంస్థను ప్రతిసారి తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ చైతన్యం దేశ వ్యాప్త విశ్వవిద్యాలయా లకు విస్తరిస్తున్నది. ప్రతి విద్యా కేంద్రం మోడీ ప్రభుత్వ విధానాలను, వాటి లోపాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళు తున్నది.


ఈ పరిణామాలు మోడీ చరిష్మాకు చెక్ పెట్టే విధంగా ఉండటంతో మోడీ ప్రభుత్వానికి, దాని మాతృ సంస్థ ఉనికికి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయా లలోని డైవర్సిటీనీ, అటానమీనీ నీరుగార్చి, విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం సాధించాలని ఎత్తుగడలకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వీటి పర్యవసనాల ఫలితాలే జేఎన్‌యూ, జాదవ్ పూర్, జామియా మిలియా మొదలు హైదరాబాద్ వరకు విశ్వవిద్యాలయాలపై నిర్బంధం, అణిచివేత.


రాజకీయ సంకుచిత మనస్తత్వాన్ని ప్రతిఘటించడం ద్వారా, అకడమిక్ బ్రాడ్ నెస్ ని రక్షించుకోవాల్సిన అనివార్యత భారతదేశంలో ఏర్పడిందని, ప్రఖ్యాత ఆర్థికవేత్త నోబెల్ పురస్కార విజేత ప్రొఫెసర్ అమర్త్యసేన్ భారతీయ విద్యా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎకడమిక్ విశాలత్వం పరిరక్షణకు విశ్వవిద్యాలయాల విద్యార్థులు రక్షణ చర్యలు ప్రారంభించారు. అధ్యయనం, పోరాటం జమిలిగా ముందుకు తీసుకు పోయే కృషి చేస్తున్నారు.


నూతన చరిత్ర సృష్టికి సమీపిస్తున్న విశ్వవిద్యాలయాలపై ప్రజలలో గల ఆదరణను దూరం చేయడానికి అసత్యాలనైనా ప్రచారం చేయాలని సంఘ్ పరివార్ అనుచరులు సిద్ధమవుతున్నారు. ఎటువంటి రిఫరెన్స్ లేని వార్తలను తమ అనుకూల శక్తులతో ప్రాచుర్యంలోకి తీసుకు పోతున్నారు. దానిలో భాగంగానే జేఎన్‌యూ అంటే ఉద్యమాలు మాత్రమే ఉంటాయి. చదువులు, నాలెడ్జ్ ఉ ండదనే తప్పుడు సూత్రీకరణ చేస్తున్నారు. వాస్తవానికి జేఎన్‌యూ అకడమిక్ ప్రతిభ తెలిసిన వారు ఎవరు ఇటువంటి ప్రచారానికి పూనుకోరు.


ఈ నేపథ్యంలో జేఎస్ యూ అమ్ముల పొదిలో దాగిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన అనివార్య సందర్భం ఏర్పడినది.


1969 ఏప్రిల్ 22న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)ను 1966 పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రపతి వి.వి.గిరి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు విద్యా ప్రపంచంలో జేఎన్‌యూ తనదైన ముద్ర వేస్తున్నది. అనేక అవిష్కరణలు, శాస్త్ర, సాంకేతిక అద్భుతాలకు జేఎన్‌యూ వేదిక అయినది. అనేక మంది శాస్త్రవేత్తలనూ, ఆర్థికవేత్తలనూ, ఫిలాసఫనూ, రాజకీయ ప్రముఖులనూ, సమాజం కోసం అలోచించే బిడ్డలనూ తన ఓడిలో పెంచి పెద్ద చేసింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన జేఎన్‌యూపై కుట్రపూరిత ప్రచారం సాగుతున్న తరుణంలో ప్రస్తుత అకడమిక్ పర్ఫామెన్స్ ని పరిశీలిద్దాం. -


జేఎన్‌యూలో ఈ విద్యా సంవత్సరం (2018) సుమారు 7304 విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 652 మంది ప్రొఫెసర్లు (309 ప్రొఫెసర్లు, 128 అసోసియేట్ ప్రొఫెసర్లు, 215 అసిస్టెంట్ ప్రొఫెసర్లు) బోధిస్తున్నారు. వీరిలో ఐదు వందల తొంభై (590) మంది పీహెచ్డీ అర్హత కలిగి ఎమినెంట్ టీచర్స్ గా ప్రఖ్యాతిగాంచారు.


జేఎన్‌యూ రీసెర్చ్ స్కాలర్స్ ఎకడమిక్ ఇయర్ (2018)లో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జాతీయ స్థాయి జర్నల్స్ లో 1040 ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. 454 నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్లు నిర్వహించారు. 2017-18 అకడమిక్ ఇయర్లో 133 రీసెర్చ్ బుక్స్ ని రచించారు. 324 చాప్టర్లను రాశారు. ఎప్పటికప్పుడు అకడమిక్ నాలెడ్జును అప్డేట్ చేసుకుంటూ నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.


2017-18 విద్యా సంవత్సరంలో 1622 మంది పరిశోధక విద్యార్థులు, 613 మంది ఎంఫిల్ విద్యార్థులు, 23 మంది ఎంటెక్ విద్యార్థులు తమ పరిశోధన గ్రంథాలను సమర్పించారు. అనేక నూతన ఆవిష్కరణలను సృష్టిస్తూ 6 పేటెంట్ హక్కులు పొందారు. మరో 33 పేటెంట్ హక్కుల కోసం పబ్లిక్ చేశారు. జేఎన్‌యూ విశ్వవిద్యాలయ లైబ్రరీలో సుమారు 5,42,738 బిబిలోగ్రఫీ గ్రంథాలు ఉన్నాయి. అనేక సంఖ్యలో వెబ్సైట్స్ బ్లాగ్స్ ఉన్నాయి. అనేక రిఫరెన్స్ గ్రంథాలు, జేఎన్‌యూ పుస్తక ప్రపంచంలో కొలువు తీరి అకడమిక్స్ లో జేఎన్‌యూను ఎవరెస్ట్ స్థాయికి చేర్చాయి.


యూనివర్సిటీ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ నాలెడ్జ్, బట్ నాట్ ఏ సెంటర్ ఫర్ ట్రైనింగ్ క్లర్క్స్ అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు.


ఈ వెలుగులోనే జేఎన్‌యూ హేతుబద్ద మేధావులను సృష్టిస్తున్నది. కానీ క్లర్క్ లను కాదు. ఇటువంటి విశాల ఆలోచనలను అర్థం చేసుకోగల సామర్థ్యం లేని నకిలీ మేధావులు జేఎన్‌యూదాని ప్రతిభపై విష ప్రచారాలు చేయడం హాస్యాస్పదం.


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ -2018 నివేదిక ప్రకారం జేఎన్‌యూ 2వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 15వ స్థానం సాధించి జేఎన్‌యూ అకడమిక్ వింగ్ లో అగ్రగామిగా నిలుస్తున్నది. ఈ వాస్తవాలను విస్మరించి జేఎన్‌యూను బ్లేమ్ చేయాలనుకుంటే అజ్ఞానులుగా మిగిలిపోతారు అనేది తేటతెల్లం అవుతున్నది. జేఎన్‌యూ విద్యార్థులు అధ్యయనం తోపాటు పోరాటాలను సమన్వయం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అంతేకాకుండా దేశంలోని మౌలిక సమస్యలపై శాస్త్రీయ చర్చను లేవనెత్తుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు, ఆరు బయట చెట్ల కింద పాఠాలు బోధించిన విద్యాసంస్థలు, చున్నీల చాటున మూత్ర విసర్జన చేసే బాలికల దీన స్థితులు, నిర్భయ మొదలు దిశ వరకు ఆగమవుతున్న అడ బిడ్డల జీవితాలు, విద్య కొనుగోలుకై చితికి పోయే జీవితాల దీన గాధలు, సామాజిక సాంస్కృతిక రాజకీయ వివక్షల ఆధారంగా కలిగే మానసిక క్షోభలను ప్రభుత్వాధినేత విస్మరిస్తునారు. రాజకీయ ప్రజయోజనాలు కోసం మత రాజకీయాలను దేశంలో ప్రేరేపిస్తున్నారు.



అధికార అట్టహాసంతో విలాసవంతంగా రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్న ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యపూరిత విధానాలపై జేఎన్‌యూ ప్రశ్నల పిడికిలిని ఎక్కుపెట్టింది. ఆకాశాన్ని తాకే విగ్రహాలుకు చేసే కోట్ల రూపాయల ఖర్చును, వేలలో ఫీజులు వసూలు చేసే విద్యా విధానమునూ, ఆడ బిడ్డలను వంట ఇంటికే పరిమితం చేసి ఆధిపత్య భావజాలమునూ, కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారుల పొందే రాయితీలూ, లగ్జరీ సౌకర్యాలు పట్ల ప్రభుత్వ తీరునూ దేశ యువతరం ప్రతిఘటిస్తున్నది. శాస్త్రబద్ధంగా ఆలోచనలకు తిలోదకాలిచ్చి నెమలి కంట నీరు, ఏనుగు తల లాంటి ప్లాస్టిక్ సర్జరీలతో కాలం వెళ్ళదీయాలనే అజ్ఞానాన్ని ప్రోత్సహించి, బోధించే ఛాందస భావాలపై దేశవ్యాప్తంగా శాస్త్రీయ పోరాటాలకు జేఎన్‌యూ పునాది లేసింది. ఈ ప్రశ్నల ప్రవాహం నుండి తప్పించుకోవడానికి జేఎన్‌యూపై ప్రభుత్వ పెద్దలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దాని ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న దేశవ్యాప్త యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు, ప్రోత్సాహకాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వాలు కేటాయించిన ఫెలోషిప్స్ లేదా ఇతర గ్రాంట్లలో సైతం కోతలు విధిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్య ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు.


నాన్ నెట్ ఫెలోషిప్ రద్దుచేస్తున్నారు. యూనివర్సిటీ హాస్టల్స్ లో ఫీజుల పెంపుదల చేస్తున్నారు. దళిత విద్యార్థులకు మాత్రమే నెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు పెడుతున్నారు. పేద, బలహీన వర్గాలు అధికంగా ఉండే సెంట్రల్ యూనివర్సిటీలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి విధానాలు పై పోరాడుతూ దేశవ్యాప్త అటెన్షన్ ను జేఎన్‌యూ క్రియేట్ చేస్తున్నది.


మోడీ ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 93,847.64 కోట్లు మాత్రమే నిధులు కేటాయించింది. వీటిలో సెంట్రల్ యూనివర్సిటీలకు 6604 కోట్లు మాత్రమే. జేఎన్‌యూ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 2018లో 352 కోట్ల 3 లక్షల 57 వేల 260 రూపాయలు మాత్రమే ప్రకటించారు. వీటిలోనే జీతభత్యాలు పరిశోధనలు అంటూ లింకు పెట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా జేఎన్‌యూ లాంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నీరుగార్చే ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తమ ఆర్భాటాలకు, ఓట్లు కోసం లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు, విద్యా అవసరాలకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. మరోవైపు ప్రభుత్వ పెద్దలే జేఎన్‌యూ లాంటి ప్రముఖ యూనివర్సిటీల ప్రతిష్ఠను దిగజార్చే ప్రకటనలు చేస్తున్నారు. అక్రమ కేసులు మోపుతూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితులలో సైతం జేఎన్‌యూ తన అకడమిక్ ప్రతిభను ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేర్చుకున్నది. యూనివర్సిటీలో అటానమీనీ, డైవర్సిటీనీ, శాస్త్రీయతనూ సహించలేని పాలకులు అధికారంలో ఉన్నంత కాలం దేశ విద్యా వ్యవస్థ తిరోగమనంలోనే ఉంటుంది. అయితే నిబద్ధత కలిగిన విద్యార్థులు, ఆచార్యులు ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించుకొని ఉన్నత శిఖరాలకు చేరుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే భారత విద్య చరిత్రలో జేఎన్‌యూ అగ్రగామిగా నిలుస్తుంది. పోరు బాటలో సైతం నడుస్తుంది. అవసరమైనప్పుడు మేమున్నాం అని అండగా నిలబడటమే మన కర్తవ్యం కావాలి.


పీడీఎస్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు & రీసెర్చ్ స్కాలర్, ఓయూ. 9948666802