2020-21 బడ్జెట్
.... ఎం. హన్మేష్
మంచి దేశానికి కావల్సినవి ఐదు ఆభరణాలంటూ తమిళ కవి తిరువళ్ళువర్, 2 వేల సం||రాల క్రింద పేర్కొన్న అంశాలను భారత దేశ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆరోగ్యం , సంపద, పంటలు, ఆనందం, రక్షణ లాంటివి ఆభరణాలని తన 'తిరుక్కురల్' గ్రంథంలో రాశారు. ఆ అంశాలను దేశానికి మోడీ అందిస్తున్నాడని నిర్మల ప్రస్తుతించారు. ఇది అభిలాషలూ, ఆకాంక్షలూ, స్వోత్కర్షలూ వెలిబుచ్చే సందర్భం కాదు. దేశ వాస్తవ ఆర్థిక గణనలు పరిగణన లోకి తీసుకొని, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు వేసుకునే సమయంలో, ప్రభుత్వ పెద్దలను సంతృప్తి చేసి, ప్రజలను భ్రమల్లో ముంచే ప్రక్రియకు పూనుకొన్నారు. వాస్తవానికి తమిళ కవి చెప్పిన ఆ ఐదు అభరణాలకు ప్రజలు మరింత దూరంగా జరుగుతున్న సక్లిష్ట స్థితిలో, సీతారామన్ వాటిని ఉటంకించడం దేశాన్ని మోసం చేయడమే. 2 వేల ఏళ్ళ కింద చెప్పిన ఆ ఆభరణాలు, దేశ ప్రజలకు కాకుండా కొంత మంది సంపన్నుల దేహాలకు అలంకరించినట్లు ఈ 2020-21 కేంద్ర బడ్జెట్ మరోసారి స్పష్టపరిచింది.
2020, ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్ళు 20,20,926, మూల ధన వసూళ్ళు 10,21,304 కలిపి మొత్తం వసూళ్ళు 30,42,230గా అంచనా బడ్జెట్ ను చదివారు. 2019-20లో అంచనా బడ్జెట్ కూ, సవరించిన బడ్జెట్ కు మధ్య లక్ష కోట్లకు పైగా తగ్గిపోయిందంటే, ప్రభుత్వాలు ప్రజలను మధ్య ఈ సందర్భంగా ఎంత వంచనకు గురిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశ పెట్టడం, వాటిపై చర్చోపచర్చలు జరగటం, మెజారిటీ ప్రజానీకానికి అర్థం కాని సమస్యగా ఉంటుంది. నిజానికి అంకెల గారడీతో గందరగోళం సృష్టించడమే తప్ప మరొకటి కాదు. సూటిగా చెప్పాలంటే మెజారిటీగా వున్న సాధారణ ప్రజలపై అన్ని రకాల పన్నుల ద్వారా వసూలు చేసిన లక్షల కోట్లను అందరికీ (సంపన్నులు + ప్రజలు) సరిపెట్టడంగా చూడొచ్చు. వసూళ్ళలో అధిక భాగం సాధారణ ప్రజలదైతే, పంపకంలో మాత్రం సంపన్నుల ప్రయోజనాలకే అగ్ర తాంబూలంగా ఉంటుంది.
బీజేపీ అధికారంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు పర్యాయాలుగా అధికారంలో సాగుతున్నది. మొదటి 5 సం||ల పాలనలో అనేక వాగ్దానాలు ఇచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 10 కోట్ల ఉద్యోగాలు, 75 లక్షల కోట్ల నల్లధనం రప్పింపు, గ్రామీణ భారత అభివృద్ధి లాంటివి ముఖ్యమైనవి. వీటిల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోక పోవడం అటుంచి, ప్రజలపై పిడుగులు పడ్డట్లుగా, నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను, ప్రభుత్వ రంగాలను అమ్మడం చేశారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థమై పోయింది. ఈ స్థితిలో 'దేశభక్తి', పాకిస్తాన్ వ్యతిరేకతల సెంటిమెంటును రెచ్చగొట్టి, పాక్ సరిహద్దులో యుద్ధ విన్యాసం చేసి, మోడీ తిరిగి అధికారం సంపాదించాడు. అయితే గత 5 ఏళ్ళ పాలనలోని ఆర్థిక అస్థవ్యస్థ పాలనతో, నేడు దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకొన్నది. అది సంక్షోభ దిశగా ప్రయాణం చేస్తున్నది.
గ్రామీణ భారతంలో రైతాంగానికి పండించిన పంటలకు గిట్టుబాటు లేక, వ్యవసాయాన్ని వదులుకుంటున్నారు. పండించిన వారు ఆత్మహత్యలకు పూనుకొంటున్నారు. గ్రామాల్లో పనిలేక పట్టణాల వలస తీవ్రమైంది. పట్టణాల్లో పని దొరకని దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమ రంగానికి తగిన ప్రోత్సాహం లేక పోగా, విరుద్ధ విధానాల వల్ల, మూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్షలాది మంది కార్మికులు పనులు కోల్పోయి, నడిరోడ్డు మీదకు వచ్చారు. అటు గ్రామీణ ప్రాంతంలో రైతులు, కూలీలూ, పట్టణంలో కార్మికులు ఉపాధి కోల్పోయి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దాంతో పారిశ్రామిక ఉత్పత్తుల, ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్క ఆటోమోబైల్ రంగంలోనే అనేక మందిని తొలగించారు. 3 షిప్టుల పని, ఒక షిప్టుగా మారి పోయింది. ఆటోల ఉత్పత్తి నిలిచిపోయింది. పార్లే బిస్కట్ కంపెనీలో 10 వేల మంది కార్మికులను తొలగించారు. దేశం మొత్తంగా ఇంతటి దుర్భర స్థితి, తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి చేసింది.
ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని సరిదిద్దే చర్యలకు పూనుకొనేట్లుగా మన కేంద్ర బడ్జెట్ ఉండాలి. ఆ దిశలో సాగుతుందని భావించారు. స్వయానా మోడీ, ఆర్థిక నిపుణులు కలిసి కూడికలు, తీసివేతలు చేస్తుండటంతో ప్రజలు, చిన్న పరిశ్రమాధిపతులు ఎన్నో ఆశలను ఊహించుకున్నారు. తీరా పార్లమెంటులో రెండున్నర గంటలపాటు నిర్మలా సీతారామన్ వల్లె వేసిన కేంద్ర బడ్జెట్ తో, స్టాక్ మార్కెట్ 11 ఏళ్ళ కనిష్ట పతనానికి చేరింది. ఉదాత్తమైన, సొంపైన కవిత్వాలతో, వచనాలతో ఆర్థిక ప్రగతి సాధ్యం కాదని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.
దేశంలో ప్రధాన రంగాలైన వ్యవసాయం, వైద్య, విద్య, పరిశ్రమలతో పాటు ఆకలి, నిరుద్యోగం, మౌలిక వసతుల కలనలు తదితరాలు ముఖ్యమైనవి. వీటిని ప్రాధాన్యతా అంశాలుగా భావించి, తగిన కేటాయింపుల ద్వారా పాక్షిక మార్పుకు గురి చేయవచ్చు. కాని గత సంవత్సరం కంటే ఒకటి, రెండు శాతాలు పెంచడమో లేదా తగ్గించడమో చేయడం ద్వారా ప్రయోజనం లేదు. కాని పాలకులు మాత్రం ప్రతి బడ్జెట్లో చేసే ప్రక్రియే ఇది. వ్యవసాయ రంగం అంటే 60 శాతం ప్రజలు ఆధారపడ్డ ప్రధాన వనరు. ఈ రంగం పేరు మీద అందరూ రాజకీయాలు చేస్తున్నారే కానీ, రైతాంగపు జీవితాల్లో కనీస కదలిక లేదు. కాంగ్రెసు గానీ, వాజ్పేయ్ గానీ నినాదాలే ఇచ్చారు. వాజ్పేయ్ ప్రతి చేతికి పని - ప్రతి చేనుకు నీరు అన్నారు. మోడీ 'రైతుల ఆదాయం రెట్టింపు' నినాదం ఇస్తున్నారు. ఒక పెద్దాయన అన్నట్లు “రెట్టింపు ఆదాయం కనపడటం లేదు ఎందుకు అంటే, అదాయం ఉంటే కదా రెట్టింపు చేసే” అన్నాడట. సరిగ్గా ఈ రోజు అలానే ఉన్నది.
గ్రామీణాభివృద్ధి రంగానికి 2019-20లో 3.65 ల.కో కేటాయిస్తే 2020-21లో 3.39 ల. కోట్లు కేటాయించింది. కేవలం 26 వేల కోట్లు అధికం చేసింది. అందులో వ్యవసాయ రంగానికి గతేడాది కంటే 9,500 కోట్లు తగ్గించి 61,500 కోట్లు కేటాయించింది. మోడీ పెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకెవై) మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎ), పి.ఎం. ఫసల్ బీమా యోజనా (పీఎంఎఫ్ బీవై), పి.ఎం. ఆశా పథకాలను కూడా తగ్గించారు. పీఎంకేవైకి గతేడాది 75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి 54 వేల కోట్లు కేటాయించారు. ఇలా ప్రతిదీ తగ్గించి “రైతు ఆదాయం రెట్టింపు” ఎలా చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాల్సి ఉన్నది. పైగా 16 అంశాల యాక్షన్ ప్లాన్ అని తెగ ఊదరగొడుతున్నారు. పాడి, మత్స్య పరిశ్రమలు పెంచుతామనడం, జీరో బడ్జెట్ సాగుకు ప్రోత్సాహకాలు అందించడం, కిసాన్ ఉడాన్, కిసాన్ రైలు' అని బడ్జెట్ లో ప్రకటించి, వదిలివేయటం తప్ప మరేమీ లేదు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 5 శాతం ప్రకటించి, ప్రస్తుతం 2.5 శాతం ఉందంటేనే మోడీ మాయా ప్రపంచాన్ని పసిగట్ట వచ్చు. ఉపాధి హామీ చట్టం కింద గతేడాది 71,002 కోట్లు కేటాయిస్తే 2020-21లో 61,500 కోట్లు కేటాయించారు. గంగప్లాన్ కింద గతేడాది 750 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేసి, నేటి బడ్జెట్ లో 800 కోట్లు కేటాయించారు.
విద్యారంగానికి గతేడాది 94,853 కోట్లు కేటాయిస్తే 2020-21లో 99,300 కోట్లు ప్రకటించింది. మొత్తం బడ్జెట్ లో గతేడాది 3.47 శాతం అయితే, ఈసారి 3.26 శాతం అయింది. అంటే గత సంవత్సరం కంటే 4446 కోట్లు తగ్గిందన్న మాట. అంతే కాకుండా విద్యారంగానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)ని బీజేపీ అనుమతిచ్చింది. ఎడీఐతోపాటు విదేశీ వాణిజ్య రుణాలకు వీలు కల్పిస్తూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణతో, విద్యారంగం ప్రమాదంలో కూరుకుపోనున్నది. కొన్ని విశ్వ విద్యాలయాలు, స్టడీ సెంటర్లు అనేవి నెలకొల్పడం చెప్పుకోవడానికి తప్ప మరొకటి కాదు.
వైద్య రంగానికి 69 వేల కోట్లు కేటాయించింది. టైర్ 2, టైర్ 3 పట్టణాలలో ఆయుష్మాన్ భారత్ ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ఆసుపత్రులకు అప్పచెపుతామని ప్రకటించారు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతున్నట్లు లెక్క. రైల్వేకు మూలధన వ్యయం 1.61 లక్షల కోట్లు కాగా కేంద్ర సాయంగా 70,000 కోట్లు ఇవ్వాలని ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (ఎఫ్ డీఐ) విధానంలో 150 ప్రైవేట్ రైళ్ళను నడపాలని నిర్ణయించారు.
ఇలా అన్ని రంగాలలో 1 పైసా పెంచి లేదా 2 పైసలు తగ్గించి బడ్జెట్ ను రూపొందించారు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ వారికి తెగ అమ్మాలని చూస్తున్నారు. ప్రభుత్వ రంగాలను ఎందుకు విక్రయిస్తున్నారంటే నష్టాల్లో ఉన్న వాటిని భరించలేమని చెప్పారు. గతంలో ఏయిర్ ఇండియా, ఎన్టీపీసీ, హెపీసీఎల్‌లను అమ్మేశారు. ఇప్పుడు అమ్మడం అని కాకుండా ముద్దుగా వాటాల విక్రయం అని చెపుతున్నారు.
100 కోట్లతో ప్రారంభించిన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఎసీ), ప్రస్తుత అజమాయిషీలో ఉన్న నిధుల మొత్తం విలువ 31.11 లక్షల కోట్లు. 40 కోట్ల మంది పాలసీ దారులు ఉన్నారు. సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల పన్నును ప్రభుత్వానికి కడుతున్నది. 2612 కోట్లను డివిడెంట్ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చింది. లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా సమకూరుస్తోంది. ఇంతటి చక్కని పాడి అవును, పాడె ఎక్కించేందుకు కుట్రలు పన్నారు. దాదాపు లక్ష కోట్లకు పైగా వాటాల విక్రయం ద్వారా పొందాలని చూస్తున్నారు. అంటే లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగాలను అమ్మి, పెట్టుబడిదారులకు లాభాలను కల్పించే ఆలోచనలో ఉన్నట్లు ఎల్.ఐ.సి.. వాటాల విక్రయం ద్వారా మరోసారి స్పష్టమయింది. బీఎస్ఎన్ఎల్ సంస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే 88 వేల మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది.
ఇక నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని సం||నికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామిని అసలు మరిచి పోయారు. రోజు రోజుకు వేలాది సైన్యం, లక్షల్లో చేరి కోట్లకు పడగలెత్తింది. నేడు నిరుద్యోగం రేటు నాలుగున్నర దశాబ్దాల కిందట గరిష్ట స్థాయికి చేరుకొంది. అంటే మోడీ విధానాల వైఫల్యం వల్ల నిరుద్యోగం 7.2 శాతానికి ఎగబాకింది.
ఇంతటి సంక్లిష్ట పరిస్థితులు, ఆర్థిక మాంద్యంలోకి దిగజారాయి. వీటిని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు వేసే సందర్భంలో మళ్ళీ కార్పోరేట్లకు లాభాల్ని కల్పించే ఉద్దీపన పథకాలతో ప్రాధాన్యత నిచ్చారు. కొద్ది కాలం కిందటే కార్పోరేట్ పన్నును 30 నుండి 22 శాతానికి తగ్గించారు. ఇప్పుడు కొత్త వాటికి 15 శాతంగా ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలకు ఆదాయ పన్ను చెల్లింపు విధానంలో 6 స్లాబుల పేరిట కొత్త పథకం అని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి చూపారు. కాని వాస్తవానికి తిరకాసు లెక్కలే తప్ప ప్రత్యేక ప్రయోజనమేమీ లేదు. ఇలా ప్రజలకు భారాలూ, సంపన్నులకు రాయితీలు కల్పిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల దాదాపు 10 లక్షల కోట్ల బ్యాంకు బకాయిలను మాఫీ చేసి, మళ్ళీ బ్యాంకులకు వేల కోట్లను ఉద్దీపనలను ప్రకటిస్తున్నారు.
ఇలా మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఆకలి, నిరుద్యోగం విలయ తాండవం చేస్తున్నాయి. వీటి నివారణగా నేటి బడ్జెట్ లో ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. దీంతో పేద ప్రజల అభ్యున్నతి, శ్రామికుల జీవనాదాయం, పెరుగుదలకు అవకాశాలు మృగ్యమవుతాయి. పైగా ఎల్‌ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ రంగాలను పూర్తిగా ప్రైవేట్ వారికే అప్పజెప్పటం మూలంగా, ప్రజల పరిస్థితులు పెనంలోంచి, పొయ్యిలోకి చందంగా మారనున్నాయి. ఇప్పటికే 1 శాతం సంపన్న భారతీయులు అట్టడుగున ఉన్న 95.3 కోట్ల మంది సంపదతో సమానంగా నున్నది. మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే 4 రెట్ల అధిక సంపద పోగు చేసుకున్నారు. మానవ వసతుల కల్పనలో, పౌష్టికాహార కల్పనలో అట్టడుగుకు చేరుకుంటున్నారు.
ఆర్థిక మాంద్యాన్నీ, ప్రజల నికృష్ట పరిస్థితుల చర్చ లేకుండా ఎస్ఆర్ సీ, సీఏఏ, ఎన్‌పీఆర్లను తెచ్చి, ప్రజల ఆలోచనలను మళ్ళిస్తున్నారు. సూడో దేశభక్తిని రెచ్చగొడుతున్నారు. కాశ్మీర్ లో 370 రద్దు చేసి, 30 వేల కోట్లతో సాంకేతిక అభివృద్ధిని సాధించాలనుకుంటున్నాడు. మత విద్వేష రాజకీయాల ద్వారా పబ్బం గడపాలనుకుంటున్నారు. ప్రజలు వాస్తవ స్థితిని గ్రహించాలి. 10 శాతం జీడీపీ వృద్ధి చేస్తానని చెప్పి, 4.5 శాతం హీనానికి మారుతున్న స్థితిని గ్రహించాలి. సంపన్నుల ప్రయోజనాల కోసం దేశాన్ని తెగనమ్ముతున్న మోడీ విధానాలను గ్రహించి, ఉద్యమించాలి.
- పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, 9441162844