మౌనం వద్దు...

ఎం. విశిష్ఠ



అమ్మ, అక్క, చెల్లి, భార్య - ఎవరైనా స్త్రీ అన్ని అవసరాలను తీర్చు ఒకే మనిషి - స్త్రీ. అన్నింటికి స్త్రీ' కావాలి. కాని హింసించేది సీనే. తన గొంతు నొక్కుతూ, తన స్వాతంత్ర్యాన్ని దోచుకుంటూ అక్రమంగా స్త్రీపై అఘాయిత్యం చేస్తున్నారు. ఇక్కడే స్త్రీ గురించి తెలుస్తోంది. అడ పిల్ల - ఆడి పిల్లేంది. ఎంత భ్రష్టు పట్టకపోతే ఈ పాడు సమాజం ఇలా తయారవుతుంది. అమ్మాయి, చెల్లెలు, అక్క, నానమ్మ, అమ్మమ్మ, కూతురు - అని ఏమి లేకుండా కామపు కళ్లతో మగ రాక్షసులు మీద పడి, అరాచకంగా, కీరాతకంగా హింసించి, కాల్చి, చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. నా అనుకున్న నాన్న, అండ అనుకున్న అన్న, తోడు అనుకున్న స్నేహితుడు... ఎవరిని నమ్మాలి?


ఏ రోజైతే స్త్రీ రాత్రి రోడ్డు మీద ఒంటరిగా, స్వేచ్చగా, ధైర్యంగా నడవగలదో, ఆ రోజే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని చెప్పారు మహానుభావుడు మహాత్మా గాంధి. కాని ఇక్కడ ఈ రోజు అడ పిల్ల ఒంటరిగా పట్ట పగలు, రోడ్డు మీద నడవడం కాదు కదా ఇల్లు దాటి కాలు బయట పెట్టలేక పోతోంది. ఎటువంటి పరిస్థితులలో ఉందో మన సమాజం, ఎంత దుర్భరమో మీరే ఆలోచించండి. .


నిర్భయా, అసిఫా, 9 నెలల పాప, మొన్న దిశ, నిన్న మానస, ఈ రోజు సాఫ్ట్ వేర్ ఇంజనీర్, రేపు - నేను, మరుసటి రోజు నీవేమో? చెప్పలేను. అమ్మాయిలు బయటకు రావడం కాదు, కనీసం అబ్బాయిని చూడాలంటే భయపడుతున్నారు. అమ్మాయి - అబ్బాయి సమానత్వం కోసం పోరాడుతున్న ఈ రోజుల్లో - అమ్మాయిలను రేప్ చేసి చంపుతున్న దౌర్భాగ్య స్థితికి, దిగజారింది నీచమైన సమాజం.


దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. మనకు తెలుస్తున్నది ఒకటి, రెండు మాత్రమే. తెలియనివి ఎన్నో. పరువు పోతుందనీ, సమాజంలో ఎలా బ్రతకాలి అని భయపడి ఉరివేసుకున్న వాళ్ళు ఎందరో. ఒక అమ్మాయి, అంటే పడుచు పిల్లపై అత్యాచారానికి పాల్పడింది అంటేనే జీర్ణించుకోలేము. అలాంటిది ఎవరో ముక్కుమొహం తెలియని వాడు ఘాతుకానికి పాల్పడితే, మరి మన ఇంట్లో మన మనిషి అది నాన్నే కావచ్చు, అన్న, స్నేహితుడు, మామయ్య, బాబాయ్, పెద నాన్న ఎవరైనా ఇలాంటి పాడు పనులు చేస్తే, వినడానికే ఇలా ఉంటే కన్న వాళ్ళకు, బాధకు లోనైన పిల్లకు ఎలా వుంటుంది.


ఇప్పటికీ 5 గురిలో నలుగురు పిల్లలు అఘాయిత్యాలకు గురవుతున్నారు. కాని ఆ విషయం వారికి తప్ప బయటి వారికి ఎవరికి తెలియదు. ఆ కన్నవాళ్లతో కూడా చెప్పుకోరు. అమ్మ తిడుతుందనో, నాన్న చదువు మాన్పిస్తాడనో భయపడతారు. ఒక అడ పిల్లగా నేను నా తోటి స్నేహితులకు ఇచ్చే సందేశం ఏమున్నా, _ ఏమైనా నీకు జరిగే ప్రతి విషయం, సంఘటన మీ తల్లిదండ్రులతో చెప్పాలి, మాట్లాడాలి, అడగాలి, చర్చించాలి. కాని మౌనంగా వుండొద్దు. నీ మౌనమే, నీ చావుకు దారి తీస్తుందని మరవకు మిత్రమా.


ఇప్పటి కాలంలో అమ్మాయిలు, స్నేహితుడనీ, భాయ్ ఫ్రెండ్స్ అనీ ప్రతి అబ్బాయిని గుడ్డిగా నమ్మేస్తారు. వాడు రెండు తీపి మాటలు చెప్పగానే - ఇట్టే కరిగిపోతారు. మీతో ఉన్న ప్రతి మనిషి నమ్మకస్తుడుగా ఉండదు. ఇప్పటి అబ్బాయిలను నమ్మడానికి వీల్లేదు. ఒక్కసారి అబ్బాయితో ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. ఒకవేళ బయట పడ్డా, వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. మీరు ఎవరితో చెప్పుకోలేక, ఏమి చేయలేక, చిత్రహింసకు లోనౌతారు. ఏమి జరిగినా, మీ తోటి వారికి (అమ్మా నాన్నలతో) చెప్పుకోండి. ఇది నా ప్రాధేయత. (ప్రతి అమ్మాయి ప్రేమలో వున్న అమ్మాయి అనుకుంటున్నట్లు కాదు). నా బాయ్ ఫ్రెండ్ అలా కాదు, మంచివాడు అని అనుకుంటారు. అలా భ్రమ పడేవాళ్ళు ఎందరో. ప్లీజ్ ఆ దృష్టిలోంచి బయటకు రండి. సమాజాన్ని చూడండి. కళ్లు తెరవండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. మరే ప్రమాదాన్ని సృష్టించుకుని ఆ గోతిలో పడకండి. మీ చావుకు మీరు కారకులు కాకండి.


సమాజం మారాలి. అమ్మాయిలు దుస్తులు వేసుకునే పద్ధతి, నడక, మాట ఇవన్ని ఏ విధంగా ఈ అఘాయిత్యాలకు కారణం కాదు. అబ్బాయిలు - వాళ్ళ కామపు కళ్ళు, వాళ్ళు అలోచించే విధానం వల్లే సమాజం ఇలా తయారవుతుంది. అమ్మాయిని కాదు అనాల్సింది. అబ్బాయిని సరిగ్గా పెంచండి. అబ్బాయి చూసే విధానాన్ని మార్చండి. వీటన్నింటికి ఒక ముగింపు ఇవ్వండి. ఆ ముగింపు ఎవరివల్లో ఊరికే రాదు. మనమే అంటే యువతే, చేతిలో చేయి కలిపి అందరం యుద్ధం చేస్తేనే తప్ప మనకు స్వేచ్ఛగాని, స్వాతంత్ర్యం గాని రాదు. 


అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి. మన చెల్లెలు, అక్క, స్నేహితురాలు ఎవరో ఒకరు సన్నివేశంలో ఉంటే, సరే పోని నువ్వే ఉంటే? మీ పరిస్థితి ఏమై ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్న భయాన్ని చంపండి. మీలో ధైర్యాన్ని నింపుకోండి. ఎదురించండి. మీరు దేనికైనా సిద్ధంగా ఉ ండండి. ఎవరిని నమ్మకండి. ఆ సన్నివేశంలో ఉన్నప్పుడు ఏదో విధంగా కాపాడుకోండి. అరవండి, గోల చేయండి, మనుషులను పోగు చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా భయపడకండి. అమాయకంగా ఉండవద్దు. పోరాడండి.


తల్లిదండ్రులు కూడా పిల్లలకు అన్ని విషయాలను చెప్పాలి. సమాజం గురించి అవగాహన కల్పించాలి. బయట జరిగే ప్రతి విషయాన్ని చెప్తే వాళ్ళకు సమాజం గురించి తెలుస్తుంది. ఎలా ఉ ంటుందో, ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. అంతేగాని వాళ్ళు తప్పుగా అనుకుంటారనీ, చెడుగా మారతారనుకునీ చెప్పకుండా ఆగిపోకండి. దీనికి ఉదాహరణ ఈ రోజు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు. దయచేసి ఇప్పటి నుంచైనా దయచేసి పిల్లలతో మాట్లాడండి. చర్చించండి. అది అమ్మాయియైనా, అబ్బాయియైనా... అన్ని విషయాలు పంచుకోండి.


- ఇంటర్ సెకండియర్ విద్యార్థిని.